మీరు వాట్సాప్ కు బానిస కావద్దంటే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..
ఉదయం నిద్రలోనుండి లేవగానే చేతిలోకి ఫోన్ తీసుకొని వాట్సప్ మెసేజ్‌లు చదవడం అలవాటుగా అయిందా మీకు? రాత్రి పడుకునే ముందు కూడా నిద్రలోకి జారేవరకు స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉండాల్సిందేనా..? యువతరంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ప్రస్తుత పరిస్థితుల్లో చేతిలో ఏం లేకున్నా బ్రతికేయవచ్చు.. కానీ స్మార్ట్ ఫోన్ లేకుంటే, వాట్సప్ వాడకుంటే బతకలేం అనే స్థితికి మనం వచ్చేసాం. రోజులో సగటున 200 సార్లు స్మార్ట్ ఫోన్‌ను చూస్తున్నామట. అంటే సుమారు 7,8 నిమిషాలకు ఓసారైనా ఫోన్ చూడాల్సిందేనన్న మాట.

బ్రిటిషర్లలో 73 % మంది.. రోజులో కనీసం ఒక్కసారైనా స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ చూడకుండా ఉండలేక పోతున్నారు. మన యువతది కూడా దాదాపు అదే పరిస్థితి. నలుగురిలో ఒకరు నిద్రపోయే సమయం కంటే ఎక్కువ ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. దీన్ని బట్టే మనం ఆన్లైన్ కు, స్మార్ట్ ఫోన్ తెరకు ఎంతగా అడిక్ట్ అయ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇక 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 70 శాతం మంది మాట్లాడం కంటే చాటింగ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. సగటు టీనేజర్ అయితే.. బెడ్ మీది నుంచి లేవక ముందే దాదాపు 3400 ఎలక్ట్రానిక్ మెసేజ్‌లను పంపిస్తున్నారట.
ఇంతకూ ఆన్‌లైన్‌కు అడిక్ట్ అయితే ప్రాబ్లం ఏంటని అనుకుంటున్నారా..?
✿ వాట్సప్ మెసేజ్‌ల కోసం పదే పదే మొబైల్ ఫోన్ చూడడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. క్లాస్‌లో లెక్చరర్ చెప్పింది బుర్రకు ఎక్కదు. ఎదుటి వ్యక్తి చెప్పింది శ్రద్ధగా వినలేం.
✿ తను ఆన్‌లైన్‌లోనే ఉన్నాడు, కానీ రిప్లయ్ ఇవ్వట్లేదు, అంటే నన్ను పట్టించుకోవడం లేదనే తొందరపాటు అభిప్రాయాలకు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల అనుబంధాలు దెబ్బతింటాయి.
✿ వాట్సప్‌లో మీరేం చేయనక్కర్లేదు, ఒక్కసారి స్టేటస్ పెట్టి చూడండి. మీ స్టేటస్ చూసినవారు ఎవరెవరు ఏ విదంగా రిప్లయ్ ఇస్తున్నారో మీకే తెలుస్తుంది. ఏ మాత్రం తేడాగా స్టేటస్ పెట్టినా.. గాసిప్‌లకు ఛాన్స్ ఇచ్చినట్టే లెక్క.
✿ వాట్సప్‌లో షార్ట్‌కట్‌లో మెసేజీలు పంపించడం వల్ల.. అర్థం పర్థంలేని (@&$₹₹~?) భాషలో పరీక్షలు రాసే ప్రమాదం కూడా ఉంది. పరీక్షలో రాసే పదాల్లోనూ షార్ట్ కట్స్ వాడితే మనకు మార్కులు తగ్గడమే కాకుండా, పేపర్లు దిద్దేవారు బుర్రలు పీక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
ఈ వ్యసనం బారి నుంచి బయట పడండిలా..
➥ తినేటప్పుడు, బయటకు వెళ్లినప్పుడు ఫోన్ చూడటం మానేయండి. ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా ఫోన్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
➥ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు లేదా మీటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లను ఒక దగ్గర పెట్టేయండి. ఎవరైతే ముందు ఫోన్‌ను పట్టుకుంటారో వారు వంట చేయాలనీ, గిన్నెలు కడగాలని లేదా అందరికీ టీ పెట్టాలని కండీషన్ పెట్టండి.
➥ పడక గదిలో ఫోన్ వాడకం ఆపేయండి. వెలుతురు లేమి వల్ల మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. నిద్ర సరిగా పట్టాలంటే మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కావాల్సిందే. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను దగ్గరకు రానీయొద్దు.
➥ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను దూరం పెట్టేయండి. దీని వల్ల పరిస్థితులకు అనుగుణంగా వెంటనే రియాక్ట్ అవ్వలేం. కాసేపట్లోనే ఊహించని ప్రమాదం బారిన పడే ఛాన్స్ ఉంది.
➥ ఓసారి డిజిటల్ తెరకు దూరంగా ఉండేలా హాలీడే తీసుకోండి. వాట్సాప్, సోషల్ మీడియా, ఈ మెయిల్స్, టెక్స్ట్ మెసేజీలను పట్టించుకోకుండా ఒక్క రోజైనా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయదానికి వీలుకాకపోతే సాధ్యమైనంత వరకు బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి
➥ రాత్రిపూట సరిపడా నిద్ర పోయేలా జాగ్రత్త పడండి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందే స్క్రీన్లకు దూరంగా ఉండండి.
➥ మీలాగే ఆన్‌లైన్‌కి, వాట్సప్ కి బానిసలైన వారితో కలిసి మీ ఆలోచనల్ని పంచుకోండి. ఇద్దరూ కలిసి ఆ అలవాటు నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. మెసేజీలను చేసే బదులు నేరుగా కలిసి గడపండి.